Friday, September 28, 2012

వరిలో విటమిన్-ఏ

వరి.... మన కడుపు నింపే ప్రధాన ధాన్యం ఇదే! మనకే కాదు. ప్రపంచ జనాభాలో సగం మందికి వరి ఆహారం. అయితే, వరిలో కూడా ఒక లోపం ఉంది. అది... విటమిన్-ఏ లోపం. అనేక రకాల పౌష్టిక విలువలున్న వరిలో విటమిన్-ఏ ఉండదు. వరిలో ఈ విటమిన్‌ను కూడా చేర్చగలిగితే... లక్షల మందిని అంధత్వం నుంచి కాపాడవచ్చు. ఈ ఆలోచనతోనే... పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి వరి అయిన 'గోల్డెన్ రైస్'ను రూపొందించారు. విటమిన్-ఏను అందులో జొప్పించారు. దీనికోసం కోట్లు ఖర్చు పెట్టారు. అయితే... జన్యువుల్లో ఎటువంటి మార్పులు లేకుండానే సాగులో చిన్నపాటి మార్పులతో వరి ద్వారా విటమిన్-ఏ పొందవచ్చునంటున్నారు మన రాష్ట్రానికి చెందిన రైతు చింతల వెంకటరెడ్డి. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం చేస్తున్న ఆయన తన పొలాన్నే ప్రయోగశాలగా మార్చారు. తన పరిశోధనపై వెంకటరెడ్డి పెట్టుకున్న పేటెంట్ దరఖాస్తును యూరోపియన్ యూనియన్ ప్రాథమికంగా అంగీకరించింది. మట్టితోనే.. వరి మొక్కలోని జన్యువులకు విటమిన్-ఏ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. కానీ, మొక్క పెరిగి పొట్టదశకు వచ్చే సమయంలో ఈ జన్యువులు పని చేయడం మానేస్తాయి. వరిలో విటమిన్-ఏ లేకపోవడానికి ఇదే కారణం. సంబంధిత జన్యువులను క్రియాశీలకంగా పని చేయించడం ద్వారా పాశ్చాత్య దేశాలు గోల్డెన్ రైస్‌ను రూపొందించాయి. అయితే... ఈ బియ్యం పసుపు రంగులో ఉంటాయి. మనకు... తెల్లన్నం తింటేగానీ తృప్తి ఉండదు. వెంకటరెడ్డి చేసిన ప్రయోగంలో జన్యు మార్పిడి లేదు. బియ్యం రంగు కూడా మారదు. కానీ... విటమిన్-ఏ మాత్రం ఉంటుంది. దీని కోసం వెంకటరెడ్డి సబ్ సాయిల్ రిమూవల్ (ఉపరితలం కింద ఉండే మట్టిని తీయటం) అనే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతిలో దున్నే ముందే- పొలంలో ఒక మూల నాలుగున్నర అడుగుల లోతు, రెండు అడుగుల వెడల్పులో గోతిని తీయాలి. ఆ మట్టిని ఒక ప్రాంతంలో జాగ్రత్త పరచుకోవాలి. ఆ తర్వాత పొలంపై ఉన్న మట్టి పొరలను తీసి, ఆ మట్టితో గోతిని పూడ్చివేయాలి. మొక్క పెరిగిన తర్వాత వరి పొట్టదశకు వచ్చే ముందు రైతులు నీరుపెట్టడం ఆపేస్తారు. పొలం కాస్త బీటలు వారాక రైతులు మళ్లీ నీరు పెట్టి ఎరువులు వేస్తారు. సరిగ్గా ఈ దశలోనే వెంకటరెడ్డి చిన్న మార్పు చేశారు. అంతకుముందే గోతి నుంచి తవ్వి భద్రపరిచిన మట్టిని నీటిలో కలిపి దానిని పొలమంతా పంపుతారు. "ఈ సమయంలో మట్టి నీటిని పంపడం వల్ల మూడు ప్రయోజనాలు ఉంటాయి. 1.మట్టిని బయటపెట్టడం వల్ల దానిపై సూర్యరశ్మి పడుతుంది. సేంద్రియ ఎరువులు కలిపితే దానిలో పోషక పదార్థాలు పెరుగుతాయి. 2. మట్టిని కలిపిన నీటిని బీటలు వారిన చేలోకి పారిస్తే.. అది బీటల మధ్యలోకి చేరుతుంది. 3. ఈ మట్టిలో ఉండే పోషకపదార్థాల వల్ల మంచి బియ్యం పండుతాయి'' అని వెంకటరెడ్డి వివరించారు. ఇలా పండిన వరిలో విటమిన్-ఏ ఉంటుందని తెలిపారు. దీనిని ప్రముఖ ప్రయోగశాల అయిన విమ్టా ల్యాబ్ కూడా «ద్రువీకరించింది. ఈ పద్ధతిలో పండించిన వరిలో 1242 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) విటమిన్-ఏ ఉందని తేలింది. ఈ ప్రయోగశాల ఇచ్చిన నివేదిక ఆధారంగా- వెంకట రెడ్డి తాను కనిపెట్టిన పద్ధతిపై పేటెంట్ ఇవ్వాలని మన దేశంలో, యూరోపియన్ యూనియన్‌కు చెందిన యూరోపియన్ పేటెంట్ ఆఫీసులో దరఖాస్తు చేశారు. ప్రాథమిక పరిశీలన తర్వాత యూరోపియన్ పేటెంట్ ఆఫీసు దీనిని పేటెంట్ ఇవ్వదగ్గ పరిశోధనగా గుర్తించి పబ్లిష్ చేసింది (ఈపీ 2272313). ఈ పేటెంట్ యూరోపియన్ యూనియన్‌కు చెందిన 29 దేశాలకు వర్తిస్తుంది.వెంకటరెడ్డి ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా పేటెంట్‌ల కోసం దరఖాస్తు చేశారు. "యూరోపియన్ యూనియన్‌లో పేటెంట్లు దరఖాస్తు చేయటానికి దాదాపు 30 లక్షల దాకా ఖర్చు అయ్యింది. ఒక్క సారి ఈ పేటెంట్ లభిస్తే మనకు మన దేశానికి వచ్చే ప్రయోజనం అపారం. అందుకే శ్రమకు వెనకాడటం లేదు'' అని వెంకటరెడ్డి. ఆయన గోధుమను కూడా ఇదే పద్ధతిలో పండించారు. గోధుమలో విటమిన్-ఏతో పాటు సీ-విటమిన్ కూడా వచ్చి చేరింది. వెంకటరెడ్డి పరిశోధనలపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు, పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు కూడా వెంకటరెడ్డి పరిశోధనలను పరిశీలించారు. "హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధనా కేంద్రం డెరెక్టర్ డాక్టర్ విరాకత్‌మత్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ. అప్పారావు, డాక్టర్ ఎం.వి. రావు మొదలైనవారందరూ వచ్చారు. పంటను చూశారు. అయితే విదేశీ సంస్థలు చూపుతున్న ఆసక్తి మన సంస్థలు చూపడంలేదు'' అని వెంకటరెడ్డి తెలిపారు. అన్నట్లు... నేలను తవ్వి, ఆ మట్టిని తదుపరి దశలో ఉపయోగించే పద్ధతిపై వెంకటరెడ్డికి ఇప్పటికే ఒక పేటెంట్ ఉంది.

No comments: