Friday, September 28, 2012

చేనుకు చేటు సంప్రదాయ వ్యవసాయం మాయం

చేనుకు చేటు సంప్రదాయ వ్యవసాయం మాయం.. వాణిజ్య పంటల వైపే రైతుల మొగ్గు సజ్జలు, రాగుల స్థానంలో మొక్కజొన్న.. మొక్కజొన్ననూ మింగేస్తున్న సోయాబీన్ కోస్తా జిల్లాల్లో వ్యవసాయాన్నే మింగుతున్న ఆక్వా, రియల్లీ.. వ్యవసాయానికి దూరమవుతున్న మలితరం ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నంతో 'పాడి-పంట' ఔట్.. ఒకే రకం పంట సాగుతో వైవిధ్యం కనుమరుగు యువతకు చిన్న ప్రశ్న!... మీరెప్పుడైనా సజ్జలు చూశారా!? పెద్దలకూ ఓ ప్రశ్న!.. మీరు సజ్జలు తిని ఎన్నాళ్లయింది? నేటి యువతకు సజ్జలంటేనే తెలియదు. పాతతరంలో చాలా మందికి సజ్జలు జ్ఞాపకాల్లోనే మిగిలిపోయాయి. సజ్జన్నం, సజ్జ రొట్టెలు... అన్నీ ఎక్కడికి పోయాయో! రానురాను రాగులదీ అదే పరిస్థితి. సంప్రదాయ వ్యవసాయమై కనుమరుగైంది. ఎక్కడ చూసినా ఒకే పంట.. ఒకే సాగు! దీంతో... పంటల్లో వైవిధ్యం పోయింది. మూడు దశాబ్దాల్లో వచ్చిన మార్పుల వల్ల పంటల సాగు పద్ధతులే మారిపోయాయి.
వర్షాధార పంటలైన జొన్న, సజ్జ, రాగులు, గోధుమ వంటి పంటలు వేసి... వాటినే ఆహార అవసరాలకోసం ఉపయోగించుకునే అలవాటు గతంలో ఉండేది. పదేళ్ల క్రితం వరకు కూడా ఉత్తర తెలంగాణలో జొన్న, సజ్జ, పసుపు, చెరుకు పంటలు ఎక్కువగా సాగయ్యేవి. వీటిని మొక్కజొన్న పూర్తిగా ఆక్రమించేసింది. ప్రస్తుతం... మొక్కజొన్న స్థానాన్ని సోయాబీన్ ఆక్రమిస్తోంది. ఒకే రకం... ఒకే పంట... ఉన్న పొలంలోనే రకరకాల పంటలు సాగు చేయడం (అంతర పంటలు) వేయడం వ్యవసాయంలో లాభసాటి ప్రక్రియ. అంతరపంటలతోపాటు రకరకాల పంటల సాగు కూడా ఇప్పుడు తక్కువైంది. ఎక్కడ చూసినా మోనో క్రాపింగ్ (ఒకే పంట విధానం) సాగుతోంది. వివిధ పంటలు సాగైతే చీడ పీడల తీవ్రత తక్కువ ఉంటుంది. ఒకే రకమైన పంట ఒకేచోట ఉండటంతో చీడపీడలన్నీ దాడులు చేసి ఒకే చోట చేరి పండగ చేసుకుంటున్నాయని పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ గోవర్ధన్ తెలిపారు. ఒక సీజన్‌లో పురుగులను నియంత్రించినా, మరో సీజన్‌లో మరో చీడ పీడలు ఆశిస్తున్నాయి. నేలలు సారాన్ని కోల్పోతున్నాయి. చివరికి... చాలామంది రైతులు పంటమార్పిడి విధానాన్ని కూడా పక్కనపెట్టేసి, ఒకే రకమైన పంటను సాగుచేస్తున్నారు. హైబ్రీడ్ వంగడాలపై మలేషియా, సింగపూర్, హాంకాంగ్‌లాంటి దేశాల్లో పరిశోధనలు జరిపి... వీటి వల్ల హాని కలుగుతుందని గుర్తించారు. కానీ... అధిక జనాభా అవసరాలు తీరేందుకు హైబ్రీడ్‌ను ఆశ్రయించక తప్పట్లేదు. మరింత ముప్పు... సంప్రదాయ పంటల స్థానంలో... వాణిజ్య పంటలను వేయడం ఒక ఎత్తు! అసలు... వ్యవసాయాన్నే పక్కనపెట్టడం మరో ప్రమాదకరమైన ఎత్తు! గోదావరి జిల్లాల్లో 40 శాతం రైతులు సేద్యానికి దూరమయ్యారు. ఆక్వా రంగం పుంజుకోవడంతో... వరిచేలు రొయ్యలు, చేపల చెరువులుగా మారుతున్నాయి. అంతో ఇంతో చదువుకున్న ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని పక్కనపెట్టి వ్యాపారాలవైపు మొగ్గు చూపుతున్నారు. రైతు కూలీల కుమారులు మరోరకం పనులు వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరిలో తొమ్మిది లక్షలకుపైగా ఎకరాల్లో వరి, చెరకు, అరటి, పత్తి, మొక్కజొన్న, పొగాకుతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, పూలతోటలు సాగయ్యేవి. రానురాను వ్యవసాయ భూములు వాణిజ్య అవసరాలకు మారిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో 2.60 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగవుతున్నట్లు అధికారులు అంచనా! రైతు మిత్రులకూ చేటు... సంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల వెనుక పరుగులు! విచ్చలవిడిగా పురుగుమందుల వినియోగం. గతంలో చీడపీడలు ఆశించినా... సంప్రదాయ పద్ధతుల్లోనే నివారించేవారు. ఇప్పుడు... అవి రాకముందే మందు వాడేస్తున్నారు. దీం తో శత్రు పురుగులతోపాటు మిత్ర పురుగులూ దెబ్బతింటున్నాయని పొలాస క్షేత్రం ఎంటమాలజీ శాస్త్రవేత్త వెంకటయ్య తెలిపారు. గతంలో మొగి పురుగుకు మందులు కొట్టాల్సిన అవసరమే వచ్చేది కాదు. 12రకాల సాలెపురుగులు, పెంకు పురుగులే మొగి పురుగును అంతం చేసేవి. ఇప్పుడు ముందే మందులు కొట్టడంతో మేలుచేసే పురుగులూ చచ్చిపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నంతోనే... ఇంటి యజమాని, తల్లి, కుమారులు, కుమార్తెలు, కోడళ్లు... ఇది ఉమ్మడి కుటుంబం! అంతా కాయకష్టం చేసి బంగారం పండించేవారు. పశువుల పాలతో ఆదాయం ఒకవైపు... పేడను ఎరువులుగా వాడుతూ మరోవైపు లబ్ధిపొందేవారు. ఇప్పుడు రైతు కుటుంబాల్లో 'ఉమ్మడి'తత్వం పోయింది. పొలాలు పంచుకుంటున్నారు. చూసుకునే వారులేక... పశువులను వదిలించుకుంటున్నారు. వ్యవసాయంపైనా శ్రద్ధ తగ్గుతోంది. అంతా కౌలు రైతులే... గోదావరి జిల్లాల్లో రైతుల వద్ద ఉండే భూమిలో 20 శాతం భూమే కౌలు రైతుల ఆధీనంలో ఉండేది. ఇప్పుడు.. 80 శాతం భూమిని కౌలురైతులే సాగు చేస్తున్నారు. భూస్వాములు వ్యాపారాల వైపు మళ్లుతున్నారు. వారి పిల్లలు ఊరు వదిలి... రాష్ట్రాలూ, దేశాలు దాటి అక్కడే స్థిరపడుతున్నారు. కోనసీమ కన్నీరు... కోనసీమలోని లక్షా 80 వేల ఎకరాల ఆయకట్టులో 10% భూములు 'రియల్ ఎస్టేట్'కు బలైపోయాయి. మరో 30 శాతం ఆక్వా సేద్యం కోసం మళ్లించారు. ఏడాదిలో రెండు పంటలు సాగు చేస్తే కౌలు రైతు నుంచి రైతుకు అందేది 20 నుంచి 25 బస్తాలు మాత్రమే. అదే ఎకరం భూమి ఆక్వా కోసం లీజుకు ఇస్తే ఎకరాకు రూ.40 - 50 వేలు వస్తుంది మరి!

No comments: