Friday, September 28, 2012

గుట్టలు గుటుక్కు!

గుట్టలు గుటుక్కు! కృత్రిమ ఇసుక పేరిట కొండలు పిండి ఇసుకకు ప్రత్యామ్నాయమంటూ ప్రోత్సాహం పర్యావరణానికి పెను ప్రమాదం తప్పదు రాష్ట్రవ్యాప్తంగా మూడువేల క్వారీల లీజు ఇసుక కోసమూ తవ్వితే రాళ్లు మాయమే ఈ భూమి... మనందరికీ ఆవాసమైన మన భూమి ఒకప్పుడు మంచుమయం. చెట్లు లేవు. పక్షులు లేవు. జీవం అన్నదే లేదు. ఉన్నదంతా... రాళ్లు, మంచు. మెల్లమెల్లగా మంచు కరగడం మొదలైంది. కరిగిన నీరు కొండలు, గుట్టల మీదుగా ప్రవహించింది. నీటి ఒరిపిడికి రాళ్లు విచ్ఛిన్నమయ్యాయి. వాటిలోని ఖనిజాలు మట్టిలో కలిసిపోయాయి. ఆ ఖనిజాల నుంచే సూక్ష్మ జీవులు (మైక్రో ఆర్గానిజమ్స్) జనించాయి. వాటి నుంచి కర్బన వాయువులు ఉత్పన్నమయ్యాయి. ఆ తర్వాత మొక్కలు ఉద్భవించాయి. మొక్కల ద్వారా... జీవానికి మూలమైన హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులు ఏర్పడ్డాయి. ఈ పరిణామ క్రమంలోనే మనిషి ఆవిర్భవించాడు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఫ్రెంచ్ శాస్త్రవేత్త అలెక్స్ కారెల్ పరిశోధనల సారాంశమిది! అంటే... మొత్తం జీవానికి మూల కారణం... నీళ్లు, రాళ్లే. నీళ్లను ఎప్పుడో కలుషితం చేసేశాం. ఇప్పుడు... రాళ్ల మీద పడ్డాం! హైదరాబాద్: రాతి గుండె, రాతి మనిషి, రాతి మనసు అంటూ... రాళ్లను ఆడిపోసుకుంటుంటాం! కానీ... రాళ్లు లేకుంటే మనిషే లేడు. మనిషి నాగరికత పుట్టిందే రాళ్ల నుంచి, రాళ్ల మధ్య! మనిషికి, రాళ్లకు మధ్య ఉన్న బంధం 'పాత రాతి యుగం' నుంచీ ఉన్నదే. అప్పుడు... రాళ్లే మనిషి ఆయుధాలు! రాళ్లతో నిప్పు పుట్టించాడు. రాళ్లతో గూడు కట్టుకున్నాడు. శిలలను శిల్పాలుగా మలిచాడు. రోడ్డు వేసినా రాయి కావాల్సిందే. ఇల్లు కట్టినా రాళ్లు కావాలి. ఇప్పుడు... ఇసుకకూ రాళ్లే దిక్కని తేల్చేస్తున్నారు. ప్రత్యామ్నాయమా! ఇసుకలోంచి తైలం తీయవచ్చు... అని వేమన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మన వాళ్లు రాళ్ల నుంచి ఇసుకను తీసేందుకు తెగ ఉబలాట పడుతున్నారు. 'ఇసుకకు ఇదే సరైన ప్రత్యామ్నాయం' అని ఊదరగొడుతున్నారు. ఈ భావనే సరికాదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. "ప్రకృతి సిద్ధమైన ఇసుకకు... కృత్రిమ ఇసుక ప్రత్యామ్నాయం అనడం సాంకేతికంగా నిజం కావొచ్చు. కానీ, ప్రకృతి ప్రకృతే. కృత్రిమం కృత్రిమమే!'' అని తేల్చి చెబుతున్నారు. ఈ ఏడాది ఇసుకపై దుమారం చెలరేగడంతో... ప్రభుత్వం రాతి ఇసుక తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఉన్న రోబో శాండ్ కంపెనీలకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తోడైంది. రోబోశాండ్ తయా రీ కోసం ప్రత్యేక జోన్లను ప్రకటించాలని పలు సంస్థలు గనుల శాఖను కోరుతున్నాయి. ఈ పరిణామం గనుల శాఖ అధికార వర్గాలనే కలవర పరుస్తోంది. "రోబో శాండ్ కోసం గుట్టలు, కొండలను లీజుకు ఇస్తే... పర్యావరణానికి తీవ్ర విఘాతం తప్పదు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రతి ఏటా నదులు, వాగులు, వంకల్లో ఇసుక మేటలు వేస్తాయి. కొన్నిచోట్ల ఆ ఇసుకను తప్పనిసరిగా తొలగించాల్సి వస్తుంది. రాతి గుట్టల విషయంలో ఇలా జరగదు'' అని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా 10 నుంచి 14 కోట్ల టన్నుల ఇసుక వినియోగిస్తున్నట్లు అంచనా.
ఇంత పరిమాణంలో రోబోశాండ్ వినియోగానికి అనుమతిస్తే అతి కొద్ది కాలంలోనే రాష్ట్రంలో గుట్టలు, కొండలు కన్పించకుండా పోవడం ఖాయం. రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్‌లకు సంబంధించి ఇప్పటికే మూడు వేల క్వారీ లీజులు ఉన్నాయి. ఇక్కడ నిరంతరం రాళ్లను పొడి చేస్తున్నారు. రాక్‌శాండ్ ఉత్పత్తి భారీ ఎత్తున ప్రారంభం అయితే ఈ లీజుల్లో ఉన్న శిలలు స్వల్ప వ్యవధిలోనే ఖాళీ అయిపోతాయని చెబుతున్నారు. రోబోశాండ్‌ను పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచన కూడా ఉంది. అయినా... అడుగు ముందుకే! పర్యావరణ వేత్తల ఆందోళనలు ఎలా ఉన్నా... గనుల శాఖ మాత్రం వివిధ మార్గాల్లో రోబో శాండ్‌ను ప్రోత్సహించాలనే నిర్ణయించుకుంది. దీనికి భవన నిర్మాణాలకు ఉపయోగించే రాళ్లతోపాటు ఉక్కు తయారీ కేంద్రాల్లోని బ్లాస్ట్‌ఫర్నేస్‌ల వద్ద లభ్యమయ్యే ఇసుక, ఇసుక రాళ్ల (శాండ్‌స్టోన్)ను ఉపయోగించాలని నిర్ణయించారు. వీటితోపాటు గ్రానైట్ వ్యర్థాలు, ఇతర ఖనిజాలను కూడా రాక్‌శాండ్ తయారీకి వినియోగించాలని తీర్మానించారు. పలు జిల్లాల్లో ఖనిజ వ్యర్థాలు భారీ స్థాయిలో వృథాగా పడి ఉన్నాయని.... వీటిని రాక్‌శాండ్ తయారీకి వినియోగించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలో రోబో శాండ్ స్థాపిత సామర్థ్యం కోటి టన్నుల వరకు ఉంది. రోబోశాండ్ తయారీ యూనిట్లకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు గనులు, భూగర్భ వనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక... రాష్ట్రంలోని రాళ్లను దేవుడే కాపాడాలి! ఇసుకను తవ్వి తీస్తే మళ్లీ ఏడాదికి ఇసుక మేట వేస్తుంది! ఒక పెద్ద బండరాయిని పొడి చేసేస్తే... మళ్లీ బండరాయి వస్తుందా? ఇదేదో సరదాగా అడిగిన ప్రశ్న కాదు! విషయం చాలా సీరియస్! కాల్వలు, ఏర్లు, నదుల్లో జల ప్రవాహంతోపాటు ఏటా ఇసుక కూడా వస్తుంది. మరి ఒక బండరాళ్ల గుట్టను పిండి చేసేస్తే, మళ్లీ గుట్ట వస్తుందా? రానే రాదు! గుట్టను పక్కన పెట్టండి... చిన్న గులక రాయిని కూడా మళ్లీ పుట్టించలేం! శిలావరణ సృష్టి... అసాధ్యం! కానీ... 'సరైన ప్రత్యామ్నాయం, ఇదే ఉత్తమ మార్గం, భేషైన పరిష్కారం' అంటూ బండరాళ్లను పిండి చేసే కార్యక్రమానికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. రోబో శాండ్... అంటే కృత్రిమ ఇసుక పేరిట కొండలకే ఎసరు పెట్టింది. ఇది తెలివైన పనేనా?

No comments: