Friday, September 28, 2012

జీవ వైవిధ్యంతోనే ఆహార భద్రత

జీవ వైవిధ్యంతోనే ఆహార భద్రత అన్ని దేశాలకూ నేరుగా లబ్ధి జన్యు పదార్థాల వినియోగ ఒప్పందాలు మేలు దీంతో అందరికీ ప్రయోజనమే నిధుల సమీకరణపైనా దృష్టి పెడతాం సమష్టి కృషి లేకపోతే మొత్తానికే ముప్పు ఎఫ్‌డీఐల వల్ల సమస్యలు తప్పవు హైదరాబాద్‌లో వచ్చే వారం ప్రారంభం కానున్న జీవ వైవిధ్య సదస్సుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఈ సదస్సు ప్రాముఖ్యం ఏమిటి? ఇందులో చర్చించే అంశాలేంటి? దీనివల్ల భారత్ వంటి దేశాలకు కలిగే ప్రయోజనాలేంటి? విదేశీ పెట్టుబడులు జీవ వైవిధ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి వంటి అనేక అంశాలపై జీవ వైవిధ్య సదస్సు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ బ్రాలియో ఫెరీరా డిసౌజా డయాస్ 'ఆన్‌లైన్'తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కెనడా నుంచి ఫోన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలోని ప్రధానాంశాలు మీకోసం.. హైదరాబాద్‌లో జరిగే జీవ వైవిధ్య సదస్సునుంచి మీరు ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నారు? జీవవైవిధ్య సదస్సు ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. గతంలో జపాన్‌లో జరిగిన సదస్సులో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. అవి ఏమేరకు అమలవుతున్నాయి? వివిధ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? ఇంకా ఏ అంశాలపై దృష్టి సారించాల్సి ఉందన్న విషయాలను ఈ సదస్సులో మొదట సమీక్షిస్తాం. జీవ వైవి«ధ్యంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తాం. గత నిర్ణయాలను అమలు చేయటానికి అవసరమైన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపైనా చర్చిస్తాం. జీవ వైవిధ్య పరిరక్షణకు, అందుకు ఎదుర య్యే సవాళ్లను ఎదుర్కొనడానికి కొన్ని వేల కోట్ల డాలర్ల నిధులు అవసరం. వీటిని ఎలా సమీకరించాలి? ఇందుకు కీలకమైన రాజకీయ మద్దతును కూడగట్టడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఉన్న నేపథ్యంలో జీవ వైవిధ్య పరిరక్షణకు నిధుల సేకరణలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నారు? ఇది చాలా కీలకమైన అంశం. ప్రస్తుతం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు. అందువల్ల అవన్నీ తమ ప్రజలకు ఉపాధి కల్పన, ఆహార భద్రతపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అయితే ఇక్కడ అందరం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక అంశముంది. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంవల్ల అనేక ప్రయోజనాలు ఉంటా యి. ఆహార భద్రత మెరుగవుతుంది. సంక్షోభ నివారణకు ఇది ఉపకరిస్తుంది. అన్ని దేశాలకు కూడా నేరుగా లబ్ధి చేకూరుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని దేశాలూ సహకరిస్తాయని భావిస్తున్నాం. జన్యు పదార్థాల ఎగుమతి, జన్యు మార్పిడి పంటలు వంటి అంశాలపై అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల్లో విభేదాలున్నాయి. వీటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? జన్యు పదార్థాల వల్ల కలిగే లబ్ధిని అందరూ పొందగలిగే విధంగా కొన్ని ఒప్పందాలను కుదుర్చుకోవాలని జపాన్‌లో జరిగిన సదస్సులో నిర్ణయించాం. ఉదాహరణకు ఒక దేశంలోని జన్యుపదార్థాన్ని వేరే దేశంలో వినియోగిస్తున్నారనుకుందాం. అప్పుడు ఆ రెండు దేశాలమధ్య ఒప్పందం జరిగితే ఇరుదేశాలూ లబ్ధి పొందుతాయి. ఇలాంటి ఒప్పందాలకు 92 దేశాలు అంగీకరించాయి. లేఖలు కూడా ఇచ్చాయి. అయితే ఇలాంటి అంతర్జాతీయ ఒప్పందాలకు ఆయా దేశాల చట్టసభలు కూడా అంగీకరించాలి. ఇప్పటిదాకా ఐదు దేశాల్లోనే ఇందుకు మార్గం సుగమం అయిం ది. వచ్చే రెండేళ్లలో చాలా దేశాలు ఈ బాట పడతాయని భావిస్తున్నాను. దీనివల్ల అందరికీ ప్రయోజనం ఉంటుంది. కానీ, ఈ ఒప్పందాలు వెంటనే అమలులోకి రాకపోవటం వల్ల భారత్ వంటి దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి కదా.. ఉదాహరణకు ఒంగోలు జాతి పశువుల జన్యుపదార్థం విదేశాలకు తరలిపోయింది. దీనిని ఉపయోగించుకొని కొన్ని కంపెనీలు వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. కానీ భారత్‌కు ఏమీ దక్కడం లేదు. ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఒంగోలు పశువుల జన్యుపదార్థం తరలివెళ్లి వందల ఏళ్లు అయిపోయింది. గతంలో జరిగిన నష్టాన్ని వర్తమానంలో పూడ్చటం చాలా కష్టమైన విషయం. కానీ భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుం డా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉదాహరణకు భారత్ జన్యు పదా ర్థం ఆస్ట్రేలియాకు తరలిపోయిందనుకుందాం. అప్పుడు ఈ రెండు దేశాలు త్వరగా ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటే మంచిది. ప్రస్తుతం లబ్ధి పొందుతున్న దేశాలు తమ లాభాన్ని ఇతర దేశాలతో పంచుకోవటానికి ఇష్టపడకపోవచ్చు కదా..? లబ్ధి పొందుతున్న దేశాలు తమ లాభాన్ని ఇతరులతో పంచుకోవటానికి విముఖత చూపిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఆ దేశాలు కూడా ఇతరులతో సహకరించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం చూస్తే వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం జీవ వైవిధ్యంపై కూడా తీవ్రంగా పడుతోంది. ఉదాహరణకు కోరల్ రీఫ్‌ను తీసుకుందాం. గత ఐదేళ్లలో అనేక మార్పులు వచ్చాయి. ఇదే విధంగా గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల కూడా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. అందువల్ల అందరూ కలిసి ముందుకు వెళ్లకపోతే మొత్తానికే ముప్పు వచ్చే ప్రమాదముంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎఫ్‌డీఐలను అనుమతిస్తే దాని ప్రభావం జీవ వైవిధ్యంపై ఎలా ఉంటుంది? ఉదాహరణకు భారత్‌లో తాజాగా ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అభివృద్ధి చెందిన దేశాలు తమ పర్యావరణానికి సంబంధించిన సమస్యలను అభివృద్ధి చెందుతున్న దేశాలపైకి తోసెయ్యాలని ప్రయత్నిస్తున్నాయి. విదేశీ పెట్టుబడుల ప్రభావం కూడా దీనిలో ఒక పార్శ్వం. దీనిని అనుమతించిన వర్ధమాన దేశాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. చైనా దీనికి ఒక పెద్ద ఉదాహరణ. అంతేకాకుండా ఇలాంటి పెట్టుబడుల వల్ల అంతర్జాతీయంగా కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు వ్యవసాయంలో సబ్సిడీలనే తీసుకుందాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయాధారితమైనవి కాబట్టి అక్కడ సహజంగానే సబ్సిడీలు ఉంటాయి. విదేశీ పెట్టుబడుల ప్రవాహం మొదలయ్యేసరికి ఈ సబ్సిడీలను తగ్గించాలనే డిమాండ్ మొదలవుతుంది. దాంతో సన్న, చిన్నకారు రైతులు దెబ్బతింటారు. మత్స్యకార్మికుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎఫ్‌డీఐలతో వారు ఉపాధి కోల్పోతారు. చిలీలో ఇదే జరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా కొన్ని జోన్‌లను కేటాయించింది. ఇలాంటి సమస్యలను ముందే ఊహించి తగిన చర్యలు తీసుకోక పోతే ఇబ్బందులు తప్పవు. జీవవైవిధ్యాన్ని కాపాడే విషయంలో ఆదివాసీలు, ఇతర తెగల ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. జీవ వైవిధ్య సదస్సులో వీరికి సంబంధించిన ఏ అంశాలను ప్రస్తావించనున్నారు? ఇది చాలా ముఖ్యమైన అంశం. స్థానిక ప్రజల హక్కులపై సదస్సులో ప్రముఖంగా ప్రస్తావిస్తాం. స్థానికులకు తాము నివసించే ప్రాంతాలపై ప్రత్యేక హక్కులు ఉండాలని.. నేషనల్ పార్కుల వంటివి ఏర్పాటు చేయటం కన్నా స్థానిక ప్రజలకు పరిరక్షణ బాధ్యతలు అప్పజెప్పడం వల్ల చాలా మేలు జరుగుతుందని భావిస్తున్నాం. అందువల్ల ఈసారి సదస్సులో కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

No comments: